Breaking: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ తెల్లవారుజామున 4.50కి రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. కాగా, రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీరావు స్థాపించిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా పేరుగాంచింది. 1974 ఆగస్టు 10న ఆయన విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఈనాడు ప్రజల మన్ననలు దక్కించుకుంది. ఈనాడుతో పాటు సితార సినీ పత్రికను ఆయన ప్రారంభించారు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రామోజీరావు తనదైన ముద్ర వేసుకున్నారు. మీడియాలో మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ను ఆయన స్థాపించారు.