పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ తెల్లవారుజామున 4.50కి రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. కాగా, రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన వ్యక్తి రామోజీరావు… మీడియా రంగానికి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.