AP CM: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నారా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే… అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని.., ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని.. భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు.

అనంతరం, చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు మిగిలిన 24 మంది మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యకుడు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి. నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రామ్‎ప్రసాద్ రెడ్డి మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ వారిని అభినందించి వారితో ఫొటో దిగారు.