Darshan: హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్‎.. టాలీవుడ్ హీరో సపోర్టు.

0
21

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: కన్నడ హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతని ప్రియురాలు పవిత్రను రేణుకా స్వామి అనే వ్యక్తి ఇబ్బంది పెడుతుండటంతో దర్శన్ అతనికి కొంత మందిని పెట్టి చంపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కేసులో దర్శన్, పవిత్రలతో పాటు పోలీసులు మరో 9 మంది నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది కాలంగా జైలులో ఉన్న దర్శన్ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఈ సంఘటనపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ.. అతనికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం దర్శన్‌కు సపోర్ట్ చేస్తూ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. అయితే ఇటీవల జరిగిన విచారణలో దర్శన్, రేణుకా స్వామికి కొట్టి కరెంట్ షాకిచ్చి చంపుతుంటే పవిత్ర ఫుల్ ఎంజాయ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలిసిన వారంతా మరీ ఇంత దారుణంగా ఉంటారా అని షాక్ అయ్యారు. అయితే ఇప్పటికీ వరకు కోలీవుడ్ వాళ్లే స్పందించారు కానీ తెలుగువారు రియాక్ట్ కాలేదు.

అయితే దీని మీద స్పందిస్తూ తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ‘ఈ సంఘటనలో బాధితుడి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కష్టకాలంలో దేవుడు వారికి గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈ విషయం మీద జనాలు స్పందిస్తున్న తీరు నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దర్శన్ అన్న కలలో కూడా ఎప్పుడూ ఇలాంటి పనులు చేసే మనిషి కాదు. దర్శన్ అన్న గురించి తెలిసిన వారికి, ఆయన ఏంటో తెలిసే ఉంటుంది. వీలైతే తనకు చేతనైనంత సాయం చేసేందుకు దర్శన్ అన్న ముందుంటాడు. ఎంతో మందికి ఆయనే ఆధారం కూడా.. దీన్ని నిజం అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మన న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం బయటకు వస్తుందని ఆశిస్తున్నాను.. బాధితుడి కుటుంబంతో పాటు మరో కుటుంబం కూడా ఈ వార్తల వల్ల ఇబ్బంది పడుతోందని అర్థం చేసుకోవాలి. వారికి ఈ కష్టకాలంలో కాస్త ఏకాంత సమయం, మనోధైర్యం అవసరం. అన్న దయా గుణం గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడని, నిజమైన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.