NCBN: పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎం నారా చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

0
22

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ప్రజా సంక్షేమంపై సీఎం చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు జూలై 1న ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇంటి దగ్గరే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనమాక గ్రామంలో ప్రారంభించారు. దీంతో పెరిగిన పింఛన్‌తో రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ.7 వేల పింఛన్ పంపిణీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది.

ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘మేము వాగ్దానం చేశాం, ఇచ్చిన మాట మేరకు పింఛన్ పంపిణీ చేశాం. నేటి నుంచి, అర్హులైన ప్రతిఒక్కరూ వారి ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను అందుకుంటారని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాను. కూటమి ఎమ్మెల్యేలందరితో పాటు, గుంటూరులో పంపిణీకి నాయకత్వం వహించి, బకాయిలతో సహా 65.31 లక్షల మంది పౌరులకు మెరుగైన పింఛన్ అందేలా నా కర్తవ్యాన్ని నిర్వహించాను. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్స్‌జెండర్లు, కళాకారులకు రూ. 4వేలు పింఛన్‌ అందుకోనున్నారు. దివ్యాంగుల రూ. 3 వేల పింఛన్ రూ. 6 వేలకు సవరించాం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 24,318 మంది సోదరీమణులకు పింఛను రూ.5 వేల నుంచి రూ. 15 వేలకు పెంచాం’ అంటూ ట్వీట్ చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.