పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ అంశాలపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే కేబినెట్ విస్తరణతో పాటు నూతన పీసీసీ చీఫ్ ప్రకటన కూడా ఉంటుందంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ సీనియర్ నేత, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంత్రి రాజనర్సింహా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రులకు ఉన్న శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. సీతక్కకు హోం శాఖ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఆసక్తికర విషయం బయటపెట్టారు.
అలానే ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు కేబినెట్‌లో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. నిజామామాద్ జిల్లా నుండి ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని వెల్లడించారు. త్వరలోనే వైద్య శాఖలో ప్రక్షాళన ఉంటుందని తెలిపారు దామోదర్ రాజనర్సింహా. కేబినెట్ విస్తరణపై స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ సాగుతోన్న వేళ మంత్రి దామోదర్ రాజనర్సింహా వ్యాఖ్యలు కొత్త ప్రచారానికి తెరలేపాయి. కేబినెట్‌లో మరో నలుగురు చోటు దక్కుతుందని ఇప్పటి వరకు ప్రచారం జరగగా.. మంత్రుల పోర్టు ఫోలియోల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని దామోదర్ రాజనర్సింహా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశపెట్టుకున్న హోం మినిస్టర్ పోస్ట్ సీతక్క ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పడంతో అధికార పార్టీలో వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.