MegaStar: థాంక్యూ రేవంత్ రెడ్డి గారు- మెగాస్టార్ చిరంజీవి

0
32

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన సందేశంతో కూడిన వీడియోను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. డ్రగ్స్‎కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయం అని తెలిపారు. అయితే, మిగతా సినీ తారలు చిరంజీవి తరహాలో డ్రగ్స్ వ్యతిరేకం ప్రచారంలో పాల్గొనడంలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా కొత్త సినిమా రిలీజైతే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవోల కోసం ప్రభుత్వం వద్దకు వస్తున్నారే కానీ, సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు రావడంలేదని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. టాలీవుడ్ నటులు సామాజిక బాధ్యతను నెరవేర్చడంలేదని తమ ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అలానే ‘ఇప్పుడు నేను మా అధికారులకు సూచన చేస్తున్నా… టికెట్ల ధరలు పెంచాలని ఎవరైనా సినిమా వాళ్లు జీవోల కోసం వస్తే.., వాళ్లు తప్పనిసరిగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనేలా ముందస్తు నిబంధన విధించండి’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ.. చిరంజీవి స్ఫూర్తిగా అందరూ ఉద్యమంలో పాలుపంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కాగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను తెలంగాణ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “థాంక్యూ రేవంత్ రెడ్డి గారూ.. ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను” అంటూ వినమ్రంగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి.