పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడి కోసం తెలుగు సినీ పరిశ్రమ ప్రజల్లో అవగాహన పెంచాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచనపై ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. తాను గతంలో ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు చేశానని, సీఎం ఆదేశాల మేరకు మళ్లీ ప్రభుత్వానికి సహకరిస్తానని అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్‌కు యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ సినిమా నటీనటులు 1 లేదా 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేశా. అయినా సీఎం ఆదేశాల మేరకు సందేశాత్మకమైన కొన్ని వీడియోలు రూపొందించి, ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నా’’ అని పోస్టు పెట్టారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. సామాజిక సమస్యలైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో సినిమా ఇండస్ట్రీ తన వంతు బాధ్యత వహించట్లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తూ ఓ వీడియో చేయాలని సూచించారు. అంతేకాకుండా, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ నటుడు చిరంజీవి ముందుకొచ్చి అవగాహన వీడియో చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.