TS Politics: నేను కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నాను- ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

0
36

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: తాను కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. గొల్ల కురుమలకు మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ, ఐదు కార్పొరేషన్లు, ప్రభుత్వ సలహాదారుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు గొల్ల కురుమలకు కేటాయించాలని సీఎం, డిప్యూటీ సీఎం, కేబినేట్‌ను కోరుతున్నామని పేర్కొన్నారు. యాదవ సామాజికవర్గం తెలంగాణ‌లో అత్యధిక జనాభాను కలిగి ఉన్నదని.., సీఎం న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకం ఉందన్నారు. రెండో విడత కార్పొరేషన్ పదవులలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కుతుందని ఆశీస్తున్నామని తెలిపారు.

అలానే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతం గొల్ల కురుమలు కాంగ్రెస్ వైపు ఉన్నారని.. సర్వేలు తేల్చాయని గుర్తు చేశారు ప్రభుత్వ విప్. ఏపీ ప్రభుత్వంలో యాదవులకు కీలక పదవులు ఇచ్చారని.., తెలంగాణలోనూ ఇస్తారనే నమ్మకం ఉందని అన్నారు. సరిత తిరుపతయ్యకు జెడ్పీ చైర్మన్ పదవి కొనసాగిస్తూనే.., పార్టీలో కీలక పదవికి హామీ దక్కిందన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని అన్నారు. పార్టీలోకి వచ్చిన నేతలపై ఆరోపణలు ఉంటే విచారణలు జరుగుతాయన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కొరకే కేంద్రంతో, పొరుగు రాష్ట్రంతో సీఎం రేవంత్ సఖ్యత‌తో మెదులుతున్నారని పేర్కొన్నారు. అధిక నిధులు తెచ్చి తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.