TS Politics: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ లపై కేటీఆర్ హాట్ కామెంట్స్.

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఆయారాం.. గయారాం సంస్కృతికి ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చేరికల విషయంలో కాంగ్రెస్ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిపై త్వరలోనే లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తామని.. ఈ విషయంలో త్వరలోనే సుప్రీంకోర్టు తలుపులు తడతామని.. ఎన్నికల కమిషన్, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంలో న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించేందుకే తాను.., హరీశ్‌రావు రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నామని వివరించారు. ఇవాళ కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడుతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టిచంపాలని రేవంత్‌రెడ్డి చెప్పారని.. మరి ఇప్పుడు ఎవరు ఎవరిని రాళ్లతో కొట్టాలో రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి చెందిన 6 మంది ఎమ్మెల్సీలు, 7 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ధ్వజమెత్తారు.