తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరనే ఉత్కంఠ కొద్ది నెలలుగా కొనసాగుతూనే ఉంది. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో.. కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే శాసనసభ ఎన్నికల తర్వాత వెంటనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో అప్పటివరకు రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. లోక్‌సభ ఎన్నికలు సైతం పూర్తయ్యాయి. దీంతో తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పీసీసీ చీఫ్ పదవి కోసం ఇప్పటికే ఎంతోమంది సీనియర్లు తమవంతు ప్రయత్నాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్4న వెలువడ్డాయి. జులైలో కొత్త పీసీసీ చీఫ్‌ను నియమిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో.. పీసీసీ చీఫ్‌ను ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు నేతలు కలిసి అధిష్టానానికి కొన్ని పేర్లను ఇప్పటికే ప్రతిపాదించారని.. ఆ పేర్లపై చర్చించి.. ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TS News: తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి
పీసీసీ రేసులోకి కొత్త పేర్లు
ముఖ్యమంత్రిగా దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్.. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కీ పీసీసీ చీఫ్ రేసులోకి వచ్చారు. మరి వీరిలో ఎవరికి పదవి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.
హైకమాండ్‌తో చర్చలు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఇవాళ హైకమాండ్‌తో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మున్సీలు గురువారం రేవంత్‌తో పాటే ఢిల్లీకి వెళ్లారు. సోనియా, రాహుల్ తెలంగాణ టూర్ పై సైతం ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. తాజాగా మంత్రి మండలిలోకి మరో నలుగురిని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్, రామచంద్రనాయక్ తదితరులున్నారు.