AP Politics: వైసీపీ ఎంపీల రాజీనామాల వెనుక జగన్ హస్తం ఉందా..?

0
32
YSRCP Rajya Sabha Members
YSRCP Rajya Sabha Members

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో కుదుపులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు పూర్తైన మూడు నెలలకే అతి పెద్ద కుదుపు వచ్చి పడింది. నమ్ముకున్న వాళ్లే నీతో ఇక సాగలేమంటూ జగన్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పార్టీ వదిలిపెడుతున్నారంటే.. స్థానిక పరిస్థితులు కారణంగా చెప్పుకోవచ్చు. అధికార పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే ఆశ కావచ్చు. కానీ ఏకంగా జగన్ ఏరికోరి తెచ్చుకున్న రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం వెనుక మతలబు ఏమిటి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే 2014 ఎన్నికల తర్వాత పరిస్థితులను ఓ సారి గుర్తు చేసుకోవాలి. అప్పటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. అనర్హత వేటు పడకుండా టీడీపీ రాజ్యసభపక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండటంతో పాటు చంద్రబాబుతో ఎంతో సన్నిహిత్యం ఉన్న నాయకులు బీజేపీలో చేరడంతో.. ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి బీజేపీలో చేరారాన్న చర్చ బాగా సాగింది. మరోవైపు చంద్రబాబు నాయుడే ఎంపీలను బీజేపీలోకి పంపించారనే ప్రచారం జరిగింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో కొంత బలహీనంగా కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇదే పార్టీలో కొనసాగితే తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని భావించిన నేతలు అధికార పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వైసీపీ అధినేత జగన్‌కు నమ్మిన బంటులుగా పేరొందిన నాయకులు పార్టీ మారుతుండటం అనేక అనుమనాలకు తావిస్తోంది.

ఇప్పటికే ఇద్దరు..

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన రావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మేడా రఘునాథరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, గొల్ల బాబూరావు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతోంది. వీరంతా వైసీపీని వీడి ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పార్టీని వీడిన ఇద్దరు ఎంపీలు కాకుండా మిగతా ఐదుగురు జగన్‌కు బాగా సన్నిహితులు. అలాంటి వ్యక్తులు వైసీపీని వీడటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చేరికల వెనుక..

వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారా.. లేదా జగన్ ఆదేశాలతో వైసీపీ కోవర్టులుగా పార్టీ మారబోతున్నారా అనే చర్చ ఇప్పటికేమ మొదలైంది. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరికల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే తమ పార్టీలో ఎవరూ చేరాలన్నా ప్రస్తుతం ఉన్న పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు పెట్టడంతో ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వీరిలో ఒకరు మోపిదేవి వెంకటరమణ.. మరొకరు బీదా మస్తాన్ రావు. ఎంపీల చేరిక విషయంలో కూటమి పార్టీలు వాటాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడుగురు ఎంపీలు చేరితే నలుగురు టీడీపీ, ఇద్దరు బీజేపీ, ఒకరు జనసేనగా లెక్కలు వేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే వ్యక్తులను టీడీపీ, జనసేనలో చేర్చుకోవాలని, వ్యాపారవేత్తలుగా ఉన్న రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకోవాలనే నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. అసలు ఎంపీల చేరికలో జగన్ హస్తం ఉందా లేదా అనే విషయంలో స్పష్టత రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest News Click Here