Andhra Pradesh: వైసీపీని షేక్ చేస్తున్న ముంబై నటి.. కేసులో పెద్ద తలకాయలు వీళ్లే.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

0
22

వారం రోజులుగా ముంబై నటి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇంత జరుగుతున్నా కనీసం వైసీపీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలు, ఐపీఎస్ అధికారుల ప్రమేయం కేసులో ఉందన్న వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి ఏపీ రాజకీయం ఈ కేసు చుట్టూ తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంబై నటి కుటుంబంపై వేధింపుల కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్‌ను నియమించింది. ఇప్పటికే ముంబై నుంచి నటి కాందంబరి జత్వాని విజయవాడ వచ్చారు. గత ప్రభుత్వంలో ఎవరెవరు తనను టార్గెట్ చేశారో పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పేశారు. తన వద్ద ఉన్న అన్ని సాక్ష్యాలను పోలీసులకు అందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సలహదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఈ తతంగం మొత్తం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సజ్జలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు తీవ్రంగా తనను వేధించిన విషయాన్ని పోలీసులకు నటి జత్వాని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహరం బయటకు రావడంతో వైసీపీ నేతలు లోలోపల తెగ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ ఫిర్యాదుతో..

ముంబై నుంచ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు పూర్తి వివరాలు తెలియజేయాలని పోలీసులు కోరడంతో నటి జత్వాని విజయవాడ చేరుకుని.. అన్ని వివరాలు చెప్పారు. దీంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగాన్ని పెంచారు. త్వరలోనే ఈ కేసులో కీలక రాజకీయ నేతలతో పాటు కొందరు ఐపీఎస్ అధికారులను విచారించనున్నట్లు తెలుస్తోంది. మొదట నోటీసులు జారీచేసి.. విచారణ చేసిన తర్వాత.. కేసులో నిందితులుగా తేలితే అరెస్ట్‌లు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే హోంశాఖ మంత్రి అనిత ఈ కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలిపారు. ముంబై నటితో పాటు కుటుంబ సభ్యులను వేధించడం, బెయిల్‌పై వచ్చిన తర్వాత బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడంపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎంతటి వారినైనా వదిలేది లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

వైసీపీ నేతల ప్రమేయంతో..!

ప్రేమ పేరుతో ముంబై నటిని మోసం చేసిన కృష్ణా జిల్లా పరిషత్తు మాజీ ఛైర్మన్ నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్.. నటి తనను మోసం చేసిందంటూ కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి జత్వానిని అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రుల ప్రమేయం ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని జత్వాని విద్యాసాగర్‌ను కోరింది. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన విషయం బయటకు రాకుండా సెటిల్ చేసేందుకు నాగేశ్వరరావు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులను సంప్రదించగా.. వారు సజ్జలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన సజ్జల ఐపీఎస్ అధికారుల ద్వారా విషయాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయోననే ఆందోళన మాత్రం వైసీపీ నేతల్లో కొనసాగుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest News Click Here