టీఎస్ఆర్టీసీ(TSRTC)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక 5 నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులు సంస్థకు దక్కాయి.ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ లో తెలిపారు. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి.
రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్ విభాగంలో ప్రథమ, అర్బన్ విభాగంలో ద్వితీయ బహుమతిని TSRTC కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను మరో ప్రథమ బహుమతిని TSRTC గెలుచుకుంది.
ఈ ఐదు అవార్డులను మార్చి 15న ఢిల్లీలో TSRTC ఉన్నతాధికారులకు ఏఎస్‌ఆర్‌టీయూ అందజేయనుంది.
టీఎస్ఆర్టీసీ ఐదు జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని అభినందించారు. నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను గెలుచుకోవడంతో ప్రజా రవాణా వ్యవస్థలో టీఎస్‌ఆర్టీసీ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు.