Bandi Sanjay : తెల్ల రేషన్ కార్డు ఉన్నా ఎందుకు కోతలు పెడుతున్రు : బండి సంజయ్

0
28

తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో గెలుస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో మీడియాతో మాట్లాడిన సంజయ్… ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని అని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 350కి పైగా సీట్లు వస్తాయని, ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణశాఖ భూములివ్వడం హర్షణీయమన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు సంజయ్. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ హామీలను అమలు చేస్తుందని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలుచేసి తీరాల్సిందేనని అన్నారు. తెల్ల రేషన్ ఉన్నప్పటికీ రూ.500కు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కోతలు పెడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో 90 లక్షల వరకు రేషన్ కార్డు కుటుంబాలుంటే అందులో 30 లక్షల మంది కుటుంబాలకు మాత్రమే పథకాలకు అందించడం ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు.