ఏపీ ఎన్నికల వేళ టీడీపీకి ఆ పార్టీ నేత బిగ్ షాకిచ్చారు. ఎన్నికల బరి నుంచి మహాసేన రాజేష్ తప్పుకున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా రిలీజ్ చేసిన తొలి జాబితాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజక వర్గం నుంచి రాజేష్ పేరును చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో రాజేశ్ అభ్యర్థిత్వాన్ని ఇరుపార్టీలకు చెందిన నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేకాకుండా రాజేష్ కు టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేసాయి .
ఈ క్రమంలో మహాసేన రాజేష్ కీలక ప్రకటన చేశారు. పి గన్నవరం టీడీపీఅభ్యర్థిగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందన్నారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా రాజేష్ తెలిపారు.
మరోవైపు వివాదాస్పదుడైన మహాసేన రాజేష్‌కు పి.గన్నవరం టికెట్‌ను కేటాయించడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘ నాయకులు శుక్రవారం విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. రాజేష్‌కు టికెట్ ఇవ్వడం అంటే బ్రాహ్మణులను టీడీపీ అవమానించినట్లేనని స్పష్టం చేశారు.
మహాసేన పేరుతో సోషల్ మీడియాను నిర్వహిస్తున్న సమయంలో రాజేశ్ హిందూవుల గురించి, వారి దేవుళ్ల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హిందూ సంఘాలు అభ్యంతరం తెలుపుతూ ఆందోళన చేయడంతో ఆయన పోటీనుంచి తప్పుకున్నారు. దీంతో, పీ గన్నవరం లో టీడీపీ కొత్త అభ్యర్దిని ప్రకటించాల్సి ఉంది.