డబ్ల్యూపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ 6/15 వికెట్లు పడగొట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె వేసిన తొలి 9 బంతుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. తర్వాతి 15 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టింది. ఇందులో నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ ద్వారా రాగా.. రెండు ఎల్బీగా వచ్చాయి.
దీంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన క్రీడాకారిణిగా ఆమె నిలిచారు. ఇప్పటివరకు మారిజాన్ కాప్ (5/15) పేరిట ఉత్తమ గణాంకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రికార్డును పెర్రీ బ్రేక్ చేశారు. పెర్రీ సంచలన ప్రదర్శనతో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆర్‌సీబీ.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
బెంగళూరు టీమ్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బౌలింగ్‌ను తట్టుకోలేక ముంబై జట్టు ఆటగాళ్లు వరుసగా వికెట్లు కోల్పోయి పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆ జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 113 పరుగులకు ఆలౌటైంది. ఎల్లిస్ పెర్రీ 6 వికెట్లు పడగొట్టింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు సునాయాసంగా విజయం సాధించింది. 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.