ఆయోధ్య రామభక్తులకు దూరదర్శన్ ఛానల్ గుడ్ న్యూస్ చెప్పింది. రామ్ లల్లా భక్తులు ప్రతిరోజూ అయోధ్య నుండి నేరుగా ‘హారతి’ సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని డీడీ ఛానెల్ వెల్లడించింది. ఉదయం 6:30 గంటలకు అయోధ్యలో రామమందిరం నుండి రోజువారీ హారతిని ప్రసారం చేయబడుతుందని దూరదర్శన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో అయోధ్యకు వెళ్లి రాముడిని దర్శించుకోలేని భక్తులు ఇకపై ఈ ప్రత్యక్ష ప్రసారంద్వారా వీక్షంచవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అయోధ్యలోని బాల రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రామయ్య దర్శనానికి రోజూ సగటున 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు వస్తున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొంటూ పలు సూచనలు చేసింది. ‘భక్తులు ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తులు మొబైల్ ఫోన్లు, పర్సులు మందిరంలోనికి తీసుకురావొద్దు. అంతేకాకుండా పూలు, దండలు, ప్రసాదం తేవొద్దు అని ట్వీట్ చేసింది.
2024 జనవరి 22న, బాల రాముడు (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మదురు రంగు కృష్ణశిలపై రామ్ లల్లా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు, బాణం పట్టుకుని దర్శనమిస్తాడు. విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 75 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు.