పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్(28) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈనెల 7న గోయల్ సర్రేలోని తన ఇంట్లో ఉండగానే నిందితులు విచక్షణ రహితంగా అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే గోయల్ ఇంటికి వెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిని సర్రేకు చెందిన మన్విర్ బస్రామ్, సాహిబ్ బస్రా సర్రే, హర్కీరత్ జుట్టి, అంటారియోకు చెందిన కెయిలాన్ ఫ్రాంకోయిస్‌లుగా గుర్తించారు.
కాగా, పంజాబ్‌లోని లుథియానాకు చెందిన గోయల్ 2019లో కెనడాకు వెళ్లారు. ఇటీవలే కెనడాలో శాశ్వత నివాస హోదా పొందారు. అక్కడ ఆయన ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. గోయల్ కాల్చి చంపబడటానికి కొద్దిసేపటి ముందు తన తల్లితో ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. యువరాజ్‌కు ఎటువంటి నేర చరిత్ర లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కెనడాకు వెళ్లడానికి కన్నా ముందు యువరాజ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశాడు.