బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో జరిగే విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా పాల్గొనున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలతో మమేకమయ్యేందుకు తెలంగాణ రాష్ట్రానికి బయలుదేరుతున్నాను. సికింద్రాబాద్‌లో జరిగే సోషల్ మీడియా వారియర్స్ మీట్‌లో తెలంగాణ యువకులతో ముచ్చటించనున్నాను. హైదరాబాద్‌లో జరిగే విజయ్ సంకల్ప్ సమ్మేళన్ సభ ప్రజల మధ్యలో ఉండేలా సెట్ చేయబడింది. ఈ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు అమిత్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.45 గంటల వరకు సోషల్ మీడియా వలంటీర్లతో మీటింగ్‌లో పాల్గొని, వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ తర్వాత ఎల్‌బీ స్టేడియంలో జరిగే విజయ సంకల్ప సమ్మేళనంలో భాగంగా మధ్యాహ్నం 3.15 గంటల నుంచి సాయంత్రం 4.25 గంటల వరకు బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు ఐటీసీ కాకతీయలో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తారు. తర్వాత సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని, తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.