హైడ్రా తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసరాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిషేధిత ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, ఇతర కట్టడాల కూల్చివేతను ప్రారంభించింది. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట అక్రమ నిర్మాణాలను కూలుస్తూనే ఉంది. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పేరుతో ఈ సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విపత్తులు వచ్చినప్పుడు సకాలంలో స్పందించడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ఈ సంస్థ ముఖ్యమైపని. హైడ్రా కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. హైదరాబాద్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మారుమోగిపోతుంది. బడాబాబుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. రోజురోజుకు హైడ్రాకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా పేరు తెరపైకి వచ్చింది.
కబ్జాదారులకు వార్నింగ్..
ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాదారులకు ప్రభుత్వం వార్నింగ్ ఇస్తోంది. ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలు.. ఏవైనా ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయండి. లేదంటే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. మున్సిపాలిటీల పరిధిలో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా ఇచ్చేయాలని లేదంటే ప్రభుత్వమే లాక్కుంటుందని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక అడుగు ముందుకేసి ఆక్రమణదారులు కబ్జా చేసిన భూములను తిరిగి ఇవ్వకపోతే హైడ్రా తరహా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో భూకబ్జాదారుల్లో వణుకు మొదలైంది. ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ ఎవరో మంత్రి క్లియర్ కట్‌గా చెప్పేశారు.
చర్యల విషయంలో..
హైడ్రా తరహా సంస్థను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తే తరువాత పరిణామాలు ఎలా ఉండవచ్చనే చర్చ మొదలైంది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాచేసి నిషేధిత ప్రాంతంలో నిర్మించిన కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి నిర్మాణాలకంటే ప్రభుత్వ భూములను కబ్జా చేసి, స్థలాలను ఆక్రమించి చేసి నిర్మాణాలు ఎక్కువుగా ఉంటాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువుగా భూములు కబ్జాలు జరిగాయనే ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి చెందిన భూమి కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకునే విధంగా ఒక సంస్థను ఏర్పాటుచేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీంతో వైసీపీకి చెందిన నేతలు ఎక్కువుగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగా ఆక్రమణలపై టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే.. కబ్జాదారుల జాబితాలో అధికారపార్టీకి చెందిన నేతలు ఉన్నా చర్యలు తీసుకోవల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. హైడ్రా తరహా సంస్థను ఏర్పాటుచేస్తే అన్ని పార్టీల నాయకులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువుగా వైసీపీకి చెందిన నాయకులు ఇబ్బంది పడటం ఖాయం.
గత ప్రభుత్వ హయాంలో..
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న భవనాన్ని కూల్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. అప్పట్లో ఆ భవనం యజమాని కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తరువాత ఆక్రమణలపై పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆక్రమణలపై చర్యలకు ఉపక్రమిస్తుందా.. లేదంటే సైలెంట్ అయిపోతుందా అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest News Click Here