AP Politics: కూటమికి 160 సీట్లు గ్యారంటీ.. బాబు లెక్క ఇదే!

0
20

రాజకీయం ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేం. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావడం అనేది ఎక్కువగా ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. మార్పు నినాదంతో గత ఎన్నికల్లో జగన్ ను గెలిపించిన జనం.. ఈసారి అదే మార్పుతో బాబును సీఎం చేస్తారా.. ఏమో ఔననే అంటోంది టీడీపీ. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ధీమా వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే 400కు పైగా లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని బాబు కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతిధ్వనించే ప్రగతిశీల శకానికి నాంది పలుకుతోంది, లోక్‌సభలో ఎన్‌డిఎ 400+, రాష్ట్ర అసెంబ్లీలో 160+ స్థానాలను అధిగమిస్తుందన్న దృఢ విశ్వాసంతో ప్రతిధ్వనిస్తోంది” అని చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టీడీపీ దీనిని వైరల్ చేస్తోంది.

పొత్తు అగ్రిమెంట్ ప్రకారం మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144 పోటీ చేయబోతోంది. 25 ఎంపీ సీట్లకు గాను 17 స్థానాల్లో కంటెస్ట్ చేస్తోంది. జనసేన, బీజేపీ మిత్రపక్షాలకు 31 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఎనిమిది లోక్‌సభ స్థానాలను ఇచ్చింది. జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుండగా, బీజేపీ 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇప్పటికే 128 మంది అభ్యర్థులను ప్రకటించగా, జనసేన ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎవరూ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించలేదు