AP Politics: నేను టీడీపీలోనే ఉంటా.. కార్యకర్తలతో మాగంటి బాబు

0
11

తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు స్పందించారు. ‘గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను పార్టీ మారతాననే వార్తలను నమ్మొద్దు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌లో ఉండటంతో క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేను. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు’ అని మాగంటి బాబు కార్యకర్తలతో అన్నారు. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మాగంటి బాబు టీడీపీని వీడనున్నట్లుగా ప్రచారం జరగగా ఆయన క్లారిటీ ఇచ్చారు.

కాగా మాగంటి బాబు తండ్రి రవీంద్రనాధ్ చౌదరి, తల్లి మాగంటి లక్ష్మీదేవి ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. 1998 లో మాగంటి బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. తర్వాత దెందులూరు నుంచి పోటీ చేసి వైఎస్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం ఆయన టీడీపీలోకి మారారు.

2009లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమిపాలయినా.. తిరిగి 2014లో సైకిల్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. రెండున్నర ద‌శాబ్దాలుగా ఏలూరు ఎంపీ సీటుతో అనుబంధం ఉన్న మాగంటి బాబు టీడీపీ త‌ర‌పున ఇప్పటికే 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా పోటీ చేస్తున్నారు.