విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక నేతల్లో వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మూడు సార్లు గెలిచారు. కానీ ఈ సారి ఆయనను ఓడించి తీరాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావును అక్కడ పోటీ చేయించాలనుకుంటున్నా వారు ఆసక్తి చూపడం లేదు.
మరోవైపు బొత్స తనదైన రాజకీయంతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బొత్స సేఫ్ జోన్‌లోనే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2004లో మొదటిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు బొత్స సత్యనారాయణ . వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఇక 2009లో రెండవసారి గెలిచారు. మంత్రితో పాటు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.
విభజన తరువాత కాంగ్రెస్ లోనే ఉంటూ చీపురుపల్లి నుంచి 2014లో పోటీ చేస్తే దాదాపుగా యాభై వేల దాకా ఓట్లు తెచ్చుకున్నారు బొత్స. ఇక 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి మూడవసారి విజయం సాధించారు. జగన్ క్యాబినెట్ లో అయిదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఇపుడు 2024లో మరోసారి చీపురుపల్లి నుంచి బొత్స బరిలోకి దిగుతున్నారు.