జెండా సభతో టీడీపీ, జనసేన కేడర్ లో జోష్ నింపారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. ఎన్నికలకు టైం దగ్గరపడటంతో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎండాకాలంతో పాటే మంటెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది.
ఏపీ నడి మధ్యలో మరోసారి పొలిటికల్ పంజా విసిరేందుకు బాబు, పవన్ రెడీ అయ్యాహరు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరవనున్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మీటింగ్‌లో వారు ప్రకటించనున్నారు. ఇందు కోసం సాధికార కమిటీల ద్వారా బీసీల నుంచి వినతులను స్వీకరించారు.
బీసీ డిక్లరేషన్… బీసీల సమగ్రాభివృద్ధి, సంరక్షణ ప్రణాళికను టీడీపీ-జనసేన కూటమి మంగళవారం విడుదల చేయనుంది. బీసీ డిక్లరేషన్‌కు సంబంధించి వివిధ అంశాలను చర్చించేందుకు ఒకరోజు ముందే టీడీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి బీసీలు పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని, వారి ఉన్నతి కోసం టీడీపీ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సభకు భారీస్థాయిలో జన సమీకరణ చేసి బల నిరూపణ చేయాలని టీడీపీ, జనసేన కూటమి భావిస్తోంది.