AP Politics: యాత్రలకు పవన్ బ్రేక్.. సింహం అడుగు వెనక్కేసిందన్న ఫ్యాన్స్

0
22

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా జ్వరం దగ్గుతో బాధపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి షెడ్యూల్ ముందస్తుగానే ఖరారయ్యింది. ప్రచారం వాయిదా వేయడం ఇష్టం లేక ఆయన ప్రచారానికి హాజరయ్యారు.

ఆరోగ్యం సహకరించకున్నా వైద్యం పొందుతూనే శనివారం నుండి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్, నేడు పిఠాపురం చేరుకుని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు.

వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పడిన జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా పొత్తు కుదిరిందన్నారు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే దాని మీద లెక్క వేయలేదని.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ప్రజలను బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పొత్తులకు ఎలాంటి షరతులు పెట్టకుండానే ముందుకు వెళ్లామన్నారు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందని.. తర్వాత ప్రచారంలో లంఘించి పోరాడి గెలుస్తుందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.