జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలైంది. మార్చి 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని.. అక్కడ ఉంటూనే ఏపీ వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారని పార్టీ వెల్లడించింది. తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత మూడు రోజులు పిఠాపురంలోనే ఉంటారు. ఉగాది వేడుకలను కూడా అక్కడే పవన్ నిర్వహించుకోబోతున్నారు.
మూడు విడతలుగా ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఖరారైంది. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు. మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులతో సమావేశాలు.. ప్రజలను కలవనున్నారు.
2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుండి మొట్టమొదటిసారి ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల ఓటమిపాలయ్యారు.దీంతో ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ సీరియస్ గా ఫిక్స్ అయ్యారు.మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ అధికారంలోకి రాకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా… తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఏకతాటి పైకి తెచ్చి కూటమి ఏర్పడేలా కీలక పాత్ర పోషించారు.