AP Politics: రిజైన్ చేసిన వాలంటీర్ల ఫ్యూచర్ ఏంటి?

0
26

ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల రాత తలకిందులైంది. ఈసీ నిర్ణయంతో ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వారికి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు, ఫోన్లను ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇక నేరుగా వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

నిజానికి చాలా చోట్ల వారు రాజీనామాలు చేసేందుకు ఇష్టపడటం లేదు కానీ వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కారు. వారు గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు. ఈ కారణంగా సర్వీస్ రూల్స్ వర్తించవు. అయితే ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున రాజకీయ పార్టీలకు నేరుగా పని చేయలేరు. రాజీనామాలు చేస్తే ఎవరికైనా పని చేసుకోవచ్చు.

వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను.. మళ్లీ వాలంటీర్లుగా నియమించుకునే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మారితే రాజీనామా చేసిన వారిని మళ్లీ తీసుకునే అవకాశం ఉండదు. పైగా గతంలో చేసిన పనుల లెక్కల్లో తప్పులు చూసి కేసులు పెడతారు. రాజీనామాలు చేయకుండా.. వైసీపీకి పని చేయకుండా ఉన్న వాలంటీర్లను మాత్రం కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వరుసగా హామీ ఇస్తూ వస్తున్నారు. వాలంటీర్లకు యాభైవేల వరకూ ఆదాయం వచ్చేలా చూస్తానని చెబుతున్నారు. దీంతో రాజీనామా చేయకుండా కొంత మంది వాలంటీర్లు తటస్థంగా ఉంటున్నారు. ఇప్పటికే తొందరపడి రాజీనామాలు చేసిన వారి పరిస్థితి ఏంటనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.