AP Politics: విశాఖ డ్రగ్స్ చుట్టూ ఏపీ రాజకీయం

0
14

వైజాగ్ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్‌ను నిన్న సీబీఐ స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరిట కంటైనర్ డెలివరీకాగా.. ఆ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. వారిద్దరికీ బీజేపీ, టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ.. అధికార పార్టీతో లింకులున్నాయని విపక్షాలు ఫొటోలు రిలీజ్ చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

ఎక్కడేం జరిగినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఏపీ ప్రతిష్ఠపై బురదజల్లడమే చంద్రబాబు పని అని వైసీపీ విమర్శించింది. ‘విశాఖలో దొరికిన డ్రగ్స్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ సంస్థకు చెందినది. దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా డైరెక్టర్ కూనం కోటయ్య చౌదరిగా గుర్తించారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబూ.. వీళ్లు మీ పార్టీకి చెందినవారు కాదా? వీళ్లు ఎవరికి బంధువులు? నీకా నీ కొడుక్కా?’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

దీనికి కౌంటర్ గా వైజాగ్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరపరిచిందని నారా లోకేశ్ ట్వీట్ చేశారు ‘ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే బినామీ కంపెనీ పేరుతో రూ.21వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చావు కదా జగన్?’ అని ట్వీట్ చేశారు.

రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం సిగ్గు చేటు. వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధానికి మార్చింది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఆపరేషన్ గరుడ నిర్వహించి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.