AP Politics: హిందూపురం రాజకీయం.. పరిపూర్ణకు టికెట్ అడ్డుకున్నది బాలయ్యేనా..?

0
19

స్వామి పరిపూర్ణానందకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. తెలంగాణలో పోటీకి ప్రయత్నించినా బీజేపీ టికెట్ దక్కలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు. బీజేపీ నుంచి ఆ ఎంపీ అభ్యర్థిత్వం కూడా దక్కలేదు. చివరికి రెబల్ ని అవుతానని ప్రకటించేస్తున్నారు. పొత్తు ఉంటుందని.. ఖచ్చితంగా హిందూపురం ఎంపీ సీటు బీజేపీకి వస్తుందని ఆయన ఆరు నెలల ముందే హిందూపురం చేరుకుని.. అక్కడే క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తిరుగుతున్నారు. అయితే టిక్కెట్ రాలేదు.

ఈ కారణంగా తాను బరిలో ఉంటానని.. తనకు టిక్కెట్ రాకపోవడానికి బాలకృష్ణే కారణమని ఆరోపిస్తున్నారు. పొత్తు కుదరక ముందు నుంచి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేస్తానని బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేశానని.. దానికి అనుగుణంగానే బిజెపి అధినాయకత్వం కూడా తనవైపు మొగ్గు చూపిందని పరిపూర్ణానందచెబుతున్నారు. కానీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ ఒత్తిడి వల్లే పార్లమెంట్ అవకాశం తనకు ఇవ్వకుండా చేశారని ఆరోపించారు పరిపూర్ణానంద.

హిందూపురంలో మైనార్టీ ఓట్లు 60 వేలకు పైగా ఉన్నాయని బిజెపికి పార్లమెంటు సీటు ఇవ్వడం వలన మైనార్టీ ఓట్లు టీడీపీకి పడవని.. తన గెలుపు కష్టమవుతుందని బాలకృష్ణ భావించి తనకు టికెట్ ఇవ్వకుండా చేశారని పరిపూర్ణానంద స్వామీజీ ఆరోపించారు. బాలకృష్ణ ఒత్తిడి మేరకే టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు హిందూపురం టికెట్ తనకు దక్కకుండా చేశారని వెల్లడించారు. హిందూపురం పార్లమెంటు నుంచి అలాగే హిందూపురం అసెంబ్లీ నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయడం ఖాయమని పరిపూర్ణానంద స్వామి స్పష్టం చేశారు. చూడాలి.. స్వామీజీకి ఎన్ని ఓట్లు పడతాయో.