మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గజ్జల వెంకటలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడంతో ప్రస్తుత మహిళా కమిషన్ సభ్యురాలైన లక్ష్మిని ఆ పదవిలో సీఎం జగన్ నియమించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్న ఆమె సేవలకు గుర్తుగా జగన్ ఈ పదవిని అప్పగించారు. తనకు పదవి ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపిన లక్ష్మి.. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని వెల్లడించారు.
జగన్‌కు అత్యంత నమ్మకమైన వైసీపీ నేతల్లో వాసిరెడ్డి పద్మ ఒకరు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్శన్‌గా చేశారు. వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో.. అధికార వైసీపీ వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జీఓ విడుదల చేసింది. అంతకుముందు ఆమె వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
వాసిరెడ్డి పద్మ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చింది. ఆమె ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేసింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడంతో ఆమె 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేసింది.