Arunachal Pradesh: ‘అరుణాచల్ ప్రదేశ్‌ను టచ్ చేయొద్దు’.. కవ్వింపు చైనాకు వార్నింగ్

0
27

కుక్క తోక వంక అన్నట్టుగా చైనా వైఖరి భారత్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. భారత్‌పై మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది చైనా. ఇండియా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌ తమదేనని కొన్నేళ్లుగా చైనా వాదిస్తోంది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి అరుణాచల్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 కొత్త పేర్లతో నాల్గవ జాబితాను చైనా విడుదల చేయడంపై భారత్ మండిపడుతోంది.

చైనా పౌర వ్యవహారాల శాఖ ఈ కొత్త పేర్లను విడుదల చేయడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించిది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఉందనీ.. ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉంటుందని ప్రపంచానికి మరోసారి తేల్చిచెప్పింది. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం సరికాదని సూచించింది.

అరుణాచల్ పై చైనా కవ్వింపులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిపాలన విభాగాలను ఏర్పాటు చేయడం, వాటికి పేరు పెడుతూ తన ఆధిపత్యం చూపించాలనుకుంటోంది చైనా. పేరు మార్చిన 30 ప్రదేశాలలో 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, 11 నివాస ప్రాంతాలు, కొంత భూమి ఉన్నాయి. పేర్ల జాబితాతో పాటు, అక్షాంశం, రేఖాంశం, ప్రాంతాల యొక్క హై-రిజల్యూషన్ మ్యాప్‌ను కూడా చైనా రిలీజ్ చేయడం వారి ధిక్కారాన్ని, ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ, “ఈ రోజు నేను మీ ఇంటి పేరును మార్చినట్లయితే, అది నాది అవుతుందా? అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం రాష్ట్రంగా ఉంది, ఉంది. ఎల్లప్పుడూ ఉంటుంది. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఉండదు” అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా గుర్తిస్తూ అమెరికా కూడా ఓ ప్రకటన చేసింది. అగ్రరాజ్యం స్పందన తమకు అసంతృప్తి కలిగించిందని చైనా తెలిపింది.