Odisha Politics: మారిన ఒడిశా రాజకీయం.. ముక్కలైన బీజేపీ, బీజేడీ బంధం

0
27

ఒడిషా రాష్ట్రంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార బిజూ జనతా దళ్‌ , బీజేపీ మధ్య బంధం వేరుపడింది. ఈ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒడిషాలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన్మోహన్‌ సమల్‌ ప్రకటించారు. ఒడిషాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయి. బీజేపీ-బీజేడీతో మధ్య పొత్తుపై గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.

బిజూ జనతాదళ్- బీజేపీ మధ్య సంబంధాలు గతంలో చాలాసార్లు తెగిపోయి అంటుకున్న సందర్భాలున్నాయి. ముందుగా 1998 నుంచి 2009 నుంచి ఈ రెండు పార్టీలు ఎన్‌డీఏ కూటమిలో ఉన్నాయి. నవీన్‌ పట్నాయక్‌ వాజ్‌పేయి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2008, 2009లో జరిగిన మతపరమైన అల్లర్ల కారణంగా ఈ రెండు పార్టీలు వీడిపోయాయి. ఈ హింసాకాండను బీజేపీ ప్రొత్సహించడం, పాల్గొనడంతో ఆ పార్టీతో బీజేడీ తెగదెంపులు చేసుకుంది.

ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీచేసినప్పుడల్లా.. దారుణమైన ఫలితాలను ఎదుర్కొంది. 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఒడిషాలో బీజేపీ అంత బలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా బలహీనపడింది. కానీ నవీన్ పట్నాయక్ వృద్ధాప్యం కారణంగా ఇబ్బంది పడుతూ ఉండటంతో మెజార్టీ సీట్లు తీసుకుని ఆ పార్టీ ప్లేస్ క్రమంగా ఆక్రమించేయాలని బీజేపీ అనుకుంది. కానీ మెజార్టీ సీట్లు ఇచ్చేందుకు నవీన్ పట్నాయక్ నిరాకరించారు. దీంతో విడివిడిగానే పోటీ చేయనున్నారు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.