పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: ఫ్లై యాష్ రవాణాలో అవినీతి జరగలేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరూపిస్తే తాను బహిరంగ క్షమాపణ చెప్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన స్వగృహం నుంచి హుజరాబాద్ మండలంలోని చెల్పూర్ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి తన స్వగృహంలో తడి బట్టల స్నానం చేసి ప్రమాణం చేశారు.
కాగా, అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు ఒక అవినీతి కూడా చేయలేదని.. ధైర్యంతో తడిబట్టలతో స్నానం చేసి ప్రమాణం చేశానని.. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. ఫ్లై యాష్ రవాణాలో 100 కోట్ల అవినీతి జరిగిందని.. అవినీతి జరగలేదని పొన్నం ప్రభాకర్ నిరూపిస్తే తాను బహిరంగ క్షమాపణ చెప్తానని అన్నారు. బుధవారం రోజు తాను హైదరాబాద్‌లోని టీటీడీ దేవస్థానానికి పదకొండు గంటలకు వస్తానని మంత్రి పొన్నం వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. అలాగే చేల్పూర్ ఆంజనేయ దేవస్థానం వద్ద 144 సెక్షన్ విధించినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు గుండాల లాగ జమ్మికుంట ఎస్సై పై దాడికి యాత్నించారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీపీని కోరారు.