TG Politics: ఇవ్వాల బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

0
31

బీఎస్పీకి గుడ్ బై చెప్పిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘నేను నా రాజకీయ భవితవ్యంపై ఈ రోజు హైదరాబాద్‌లో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. ఆ సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ, నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాను. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ.. వారి కలలను నిజం చేసే దిశగా పయనిస్తా. దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి.. జై భీం జై తెలంగాణ… జై భారత్‌ ’ అంటూ పోస్ట్ చేశారు.

సుదీర్ఘకాలం పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి (ఐపీఎస్‌) తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరారు. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో కాకుండా బీఆర్‌ఎస్‌లో చేరుతుండటం ఆసక్తిగా నెలకొన్నది.