సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 8.45 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో యాదాద్రికి వెళ్తారు. ఉదయం 9.30 గంటలకు స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భద్రాచలం బయలుదేరుతారు. సీఎం హోదాలో రేవంత్ యాదాద్రికి వెళ్లడం ఇదే తొలిసారి. కాగా ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు యాదాద్రిలో పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
అనంతరం భద్రాచలం చేరుకుని శ్రీ సీతారమచంద్ర స్వామివారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మణుగూరులోని ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.
ఇందిరమ్మ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది.