TS Politics: రేపటి నుంచి జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. తొలుత సొంత జిల్లా పాలమూరు నుంచే టూర్ స్టార్ట్

0
13
CM Revanth Reddy
CM Revanth Reddy

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత సొంత జిల్లా పాలుమూరు నుంచే తన టూర్‌ను మొదలు‌పెట్టనున్నారు. ఈ నెల 9న ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదుగురు కలెక్టర్లతో రివ్యూ నిర్వహించనున్నారు. ప్రధానంగా తాగు, సాగు నీరు, విద్య, వైద్యంపై సమీక్షించనున్నారు. దీంతో పాటు కొత్త కార్యక్రమాలు, పెండింగ్‌లోని పనులపై ఆరా తీయనున్నారు. ఇలా ప్రతి రెండు రోజులకో ఉమ్మడి జిల్లా విజిట్ చేయాలని సీఎం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలానే ఈ నెల 15న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించే ఛాన్స్ ఉన్నది. సీఎం పర్యటన అధికారిక షెడ్యూలును సోమవారం ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల కేబినేట్ సమావేశంలో ఉన్నతాధికారులంతా హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ తిరిగి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. తాను కూడా పర్యటిస్తానని ప్రకటించారు. దీనిలో భాగంగానే జిల్లాల విజిట్‌ను మొదలు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం అవుతోంది. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా సీఎం ప్రోగ్రాం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నది.

నేడు వైఎస్ఆర్ 75వ జయంతి.. ఏపీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఏపీకి వెళ్లనున్నారు. విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో జరగనున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభలో ఆయన పాల్గొననున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు హజరయ్యే ఛాన్స్ ఉన్నది. ఇటీవల షర్మిల హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ వైఎస్సార్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. గాంధీభవన్‌తో పాటు వివిధ కూడళ్ల వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. యూపీఏ 1, 2 లో క్రియాశీలకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులు వైఎస్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు.