TG Politics: KTR కామెంట్సే బూమరాంగ్ అయ్యాయా..? బీఆర్ఎస్‌లో అంతర్మథనం

0
28

ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారందరినీ జైలుకు పంపుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం తెలుగు రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. నిందితులకు చర్లపల్లి జైల్లో చిప్పకూడే గతి అని ఆయన శుక్రవారం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని… కేసీఆర్ గత పాలనలో ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ప్రజలతో పాటు పోలీసులను భయభ్రాంతులకు గురి చేసిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో జరిగిన ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (పీఈసీ) సమావేశంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసిన ప్రకటనను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రీసెంట్ గా ఓ సభలో.. ఎన్నికల సమావేశాలలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చని.. అధికారులు కొన్ని సంభాషణలు విన్నారని .. అందులో తప్పేముందని కేటీఆర్ అన్నారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరునెలల్లో కూలుతుందని.. ఆలోపే కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని కేటీఆర్ చెప్పడం కూడా కాంగ్రెస్ నేతల దూకుడుకు కారణం అని విశ్లేషణలుు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ ఉందని గమనించిన కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. తన స్పీడు పెంచారు. అటు కేసులు.. ఇటు చేరికలతో బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ‘మాజీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన దారుణమైన చర్య ఇది. వారు ప్రజల సంభాషణలను ఎలా వినగలరు? బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించిన పోలీసు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన పోలీసులకు ఒక్క బీఆర్‌ఎస్ నాయకుడు కూడా మద్దతు ఇవ్వలేదు. విచారణ కొనసాగుతోందని, ఫోన్ ట్యాపింగ్‌లో చిక్కుకున్న వారు చర్లపల్లి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’. అక్కడే చిప్పకూడు తినాల్సి ఉంటుంది’ అని టీపీసీసీ అధ్యక్షుడు చెప్పారు.