TG Politics: కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. హెచ్చరించిన భట్టి

0
22

మాజీ మంత్రి కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ‘రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి, తిరిగి మమ్మల్ని తిడుతున్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’ అని హెచ్చరించారు. బీఆర్ఎస్‌లా తాము పాలనను గాలికి వదిలేసి, సోషల్ మీడియాకే పరిమితం కాలేదని భట్టి విమర్శించారు. ఇక ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారు. ఎవరైనా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తారా? కొన్ని ఫోన్ కాల్స్ విన్నామని కేటీఆర్‌ చెప్తున్నారు. వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. బీఆర్ఎస్ చెప్పినట్టు విన్న అధికారుల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పకుండా చర్యలుంటాయి’ అని అన్నారు.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారికంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్‌ని జత చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దేశంలో అతి తక్కువ కేసుల్లోనే ఈ యాక్ట్‌ని ప్రయోగించారు. ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసుల్లోనే నిందితులు ప్రణీత్, తిరుపతన్న, భుజంగరావును విచారించారు.