పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన స్థిర నివాసం పిఠాపురంలో ఏర్పాటు చేసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన పిఠాపురంలో జరిగిన వారాహి సభలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన కొనుగోలు చేసిన భూమి ఎక్కడ ఏంటనే దానిపై అంతా ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో ఆ వివరాలు బయటకొచ్చాయి.
పిఠాపురం-గొల్లప్రోలు టోల్‌ప్లాజా పక్కనే ఉన్న వ్యవసాయ భూమిని పవన్ కళ్యాణ్ తనపేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తం 3.52 ఎకరాల భూమిని ఆయన కాకినాడ జనసేన నాయకుడు, లీగల్ అడ్వైజర్‌గా ఉన్న తోట సుధీర్ రిప్రజెంటేటివ్‌గా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. 1.44 ఎకరాలు ఒక డాక్యుమెంట్‌గాను, 2.08 ఎకరాల భూమిని రెండో డాక్యుమెంట్‌గా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇల్లు క్యాంపు కార్యాలయంతోపాటు, హెలిప్యాడ్, అలాగే కార్యకర్తల సమావేశాలకు భారీగా హాలు కూడా ఈ స్థలంలోనే నిర్మించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వాస్తవానికి పవన్ 18 ఎకరాల వరకూ భూమిని ఇదే పరిసర ప్రాంతంలో కొనుగోలు చేసి భారీ నిర్మాణం చేపట్టే అవకాశాలున్నాయని.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ భూమి విలువ కోటి రూపాయలకిపైగా ఉందని.. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారని చేబుతున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇలింద్రాడ గ్రామాల రెవిన్యూ పరిధిలో ఉన్న భూమిని పవన్ కొనుగోలు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయి.