EC: రోడ్ షోలపై ఈసీ కీలక ప్రకటన

0
14

ఎన్నికల రోడ్ షోలకు సెలవు రోజుల్లోనే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో నిషేధం లేకున్నా. ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్, బ్లడ్బ్యాంకులున్న ప్రాంతాల్లో రోడ్లు చేపట్టవద్దన్నారు. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే డాక్యుమెంట్లు చూపించాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.85 ఏళ్లు పైబడిన, దివ్యాంగ ఓటర్లు 7.2 లక్షల మందికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన 4 రోజుల తర్వాత హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

8 లక్షల బోగస్ ఓట్లు తొలగించాం

గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 లక్షల ఓట్లు కొత్తగా యాడ్ అయినట్లు సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. మొత్తం 8,58,491 ఓట్లు తొలగించామని.. మరో 7 లక్షల ఓటర్ల వివరాల్లో కరెక్షన్స్ చేశామని చెప్పారు. ఫిర్యాదులు, అధికారుల విచారణ తర్వాత బోగస్ ఓట్లు తొలగించాం. ఈసారి పోస్టల్ ఓటింగ్ కు ఇబ్బంది లేకుండా కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నాం.

గత పార్లమెంట్ ఎన్నికల్లో 62.72 శాతం ఓటింగ్ నమోదయ్యిందని తెలిపారు వికాస్ రాజ్. పోలింగ్ శాతం పెంచడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించాం. దీని కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. గతంలో 5వేల పోలింగ్ కేంద్రాల్లో తక్కువ ఓటింగ్ నమోదైనట్టు మా దృష్టిలో ఉంది. ఎండా కాలంలో ఎన్నికలు జరుగుతున్నందున ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.