Adilabad: ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం రైతులు ఆందోళన

0
16

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో మూడు రోజులుగా పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. మార్కెట్లో రాశి-659 పత్తి విత్తనాల కొరత కారణంగా ప్రతిరోజు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు. గురువారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పంజాబ్ చౌరస్తాలోని నిఖిల్ ట్రేడర్స్ విత్తనాల దుకాణం నుంచి వాహనంలో విత్తనాలను ఇచ్చోడ కేంద్రానికి తరలిస్తుండగా రైతులు పట్టుకొని అడ్డుకున్నారు. దినమంతా లైన్లో నిల్చుంటే రెండు పత్తి విత్తన బ్యాగులు కూడా దొరకడం లేదని.. ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఇంకా లభం లేదని పంజాబ్ చౌరస్తా రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు రైతులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. డిఎస్పి‌ఎల్ జీవన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. నిఖిల్ ట్రేడర్స్ నుండి పత్తి విత్తనాలు తరలింపు వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. నిజంగానే బ్లాక్ మార్కెట్ తరలిస్తే చర్యలు తీసుకుంటామని డిఎస్పీ పేర్కొనడంతో రైతులు శాంతించి, రాస్తారోకో విరమించారు.