Hyderabad: రేపే మృగశిర కార్తె.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‎లో చేప ప్రసాదం

0
35

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్‌లోని నాంపలి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిన కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ ఏడాది కూడా పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం (జూన్ 8వ తేదీన) నుంచి మృగశిర కార్తె మొదలుకావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‎తో పాటు పలువురు అధికారులు గురువారం పర్యవేక్షించారు.

చేప ప్రసాదం కోసం వేలాది మంది తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ ‎లోపలికి అజంతా గేటు నుంచి అనుమతిస్తారు. అక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్లలో చేప ప్రసాదం కోసం క్యూలైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా టోకెన్లు ఇచ్చి అనంతరం.. కౌంటర్‌లో చేప ప్రసాదం అందజేయనున్నట్లు తెలిపారు. పంపిణీకి మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేయగా.. ఇందులో దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా, శుక్రవారం సచివాలయంలో బత్తిని సోదరులు మంత్రి పొన్నం ప్రభాకర్‎ను మర్యాదపూర్వకంగా కలిసి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.