Devotion: శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి ఉగాది మహోత్సవాలు

0
39

శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఏటా పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. పార్కింగ్, శౌచాలయం, మంచినీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కాణాదారులు భక్తులతో మర్యాదగా మెలిగి సంయమనం పాటించాలని ఈవో సూచించారు. ధరల పట్టికతో ఎంఆర్పీ ధరలకే వస్తువులను విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. దుకాణాదారులు, హోటల్ నిర్వాహకులు శుచి శుభ్రతలను పాటించాలని ఈవో ఆదేశించారు. ప్రతి దుకాణాదారుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ ప్రసాదరావు ఆదేశాలు జారీ చేశారు.

ఆలయ క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, అల్పహారం అందించాలని ఆదేశించారు. ఎండతీవ్రత కారణంగా క్యూకాంప్లెక్స్‌లో అవసరం మేరకు కూలర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలకు ఆలయంతో పాటు పరిసరాలన్నీ లైంటింగ్‌తో అలంకరించాలని సూచించారు. క్షేత్ర పరిధిలో, కైలాస ద్వారం వద్ద జిల్లా వైద్యాశాఖ సహకారంతో తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.