రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. అదిలాబాద్ లోని ప్రజాసేవాభవన్‌లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, ZPTCగా పనిచేసిన అనుభవం తనకుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు ఎంపీ టికెట్ ఇస్తే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తనకు టికెట్ ఇవ్వందే నయమని, కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు రేఖా నాయక్ .
రేఖ నాయక్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ ZPTC గా పోటీచేసి, విజయం సాధించింది. 2013లో బీఆర్ఎస్ లో చేరారు. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారితో విజయం సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రేఖా నాయక్ కు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీకి ప్రచారం చేసింది రేఖా నాయక్. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వెడ్మ బొజ్జు గెలిచారు.