టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మెగా డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
విద్యాశాఖ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వెంటనే టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, టెట్ చైర్మన్ వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 10 తేదీ వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఇందులో భాగంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. మెగా డీఎస్సీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 22 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులను నింపుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.