గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు.. అమ్మకానికి అమ్మాయిల వీడియోలు.. అసలు ఏం జరిగింది..?

0
46
Girls Hostel Incident
Girls Hostel Incident

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో ఓ ఇంజినీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరా వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. 300కు పైగా అమ్మాయిల ప్రయివేట్ వీడియోలు చిత్రీకరించారనే రచ్చ ఓ వైపు కొనసాగుతుంటే.. పోలీసులు మాత్రం గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు ఏమి లేవంటూ ప్రాథమికంగా ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన విద్యార్థులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు కళాశాలకు చెందిన కొందరు అబ్బాయిలకు చేరాయనే ఆరోపణలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఈ వ్యవహరం జరుగుతున్నా.. కళాశాల యాజమాన్యం సరిగ్గా స్పందించకపోవడంతో విద్యార్థినులు రోడ్డెక్కడంతో విషయం బయటకు పొక్కింది. హిడెన్ కెమెరాల వ్యవహరంలో అదే కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. నిందితురాలిగా చెబుతున్న అమ్మాయి ఓ రాజకీయ నేత కుమార్తె కావడంతో ఆమె పేరు దాచిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏం జరిగింది..?

గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు పెట్టారా లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరాలు పెట్టారని కళాశాలకు చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు చెబుతుంటే.. కళాశాల యాజమాన్యం మాత్రం కళాశాల హాస్టల్‌ వాష్‌రూమ్స్‌లో ఎలాంటి కెమెరాలు పెట్టలేదని.. అదంతా ఫేక్ అంటూ కొట్టిపారేస్తుంది. మరోవైపు విద్యార్థినుల వీడియోలు కొందరు బాయ్స్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలను చూపించి కొందరు అమ్మాయిలను అబ్బాయిలు లోబర్చుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహరంలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ప్రమేయం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి సాయంతో మొత్తం వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీడియోలను కొందరు ఫైనల్ ఇయర్ విద్యార్థుల దగ్గర ఉంచుకుని వాటితో బ్లాక్ మెయిల్ చేయాలనే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కెమెరాలు ఎలా..?

గర్ల్స్ హాస్టల్‌లో అబ్బాయిలకు ప్రవేశం ఉండదు. వార్డెన్‌తో పాటు గేట్ బయట సెక్యూరిటీ ఉంటారు. కానీ గర్ల్స్ హాస్టల్‌లో కెమెరాలు ఎలా పెట్టారనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. హాస్టల్ సిబ్బంది సహకారంతో ఇది జరిగిందా.. లేదంటే విద్యార్థినుల ప్రమేయం జరిగిందా అనే విషయం పోలీసుల విచారణ తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు తమకు ఎలాంటి వీడియోలు దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మీ దగ్గర ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని కళాశాల యాజమాన్యం విద్యార్థులను అడుగుతోంది. ఆరోపణలు చేస్తున్న విద్యార్థినులు ఇప్పటివరకు ఎలాంటి వీడియోలను కళాశాల యాజమాన్యానికి అందించలేదు. ఈ వీడియోలను ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు పంపించలేదని.. ఒక ఫోన్‌లోనే ఉంచి వాటిని కొందరు బాయ్స్ చూశారని కళాశాలకు చెందిన కొందరు బాయ్స్ ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు.

దాచిపెడుతున్నారా..!

గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల విషయం బయటకు వస్తే కళాశాల పరువుతో పాటు.. ఆ కేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని దాచిపెడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు తమ వీడియోలు బయటకు వెళ్తే తమ భవిష్యత్తు ఏమి కావాలంటూ బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థినులు కళాశాల యామమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. నిందితులను వదిలిపెట్టొద్దని వేడుకుంటున్నారు. ఇంజినీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వ్యవహరం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది.. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest News Click Here