ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ ఈడీ చేస్తున్న ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. దీంతో ఆయనకు ఇంకా శిక్ష పడలేదు. ప్రస్తుతానికి ఆయన నిందితుడు మాత్రమే. కాబట్టి, సీఎంగా కొనసాగేందుకు చట్టప్రకారం అడ్డంకులుండవని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే నైతిక పరంగా అయితే అది కరెక్ట్ కాదంటున్నారు ఎక్స్ పర్ట్స్.
ఢిల్లీలో పదవిలో ఉండగా అరెస్టైన తొలి సీఎం కేజ్రీవాల్. గతంలో బిహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూప్రసాద్‌పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రిదేవికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అరస్టయిన హేమంత్ సోరెన్ కూడా అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడే జయలలితకు శిక్ష పడింది. దీంతో ఆమె సీఎం పదవిని కోల్పోయారు. చట్టప్రకారం శిక్ష పడ్డాక పదవిని కోల్పోతారు.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అనేది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. కాబట్టి, ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి చట్టపరంగా అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్తున్నారు. అందుకే గతంలో అరెస్ట్ అవుతామని తెలిసిన వాళ్లు ముందుగానే రాజీనామా చేశారు. అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతను అరెస్టు చేయవచ్చా అంటే.. చట్టపరమైన అడ్డంకులేమీ లేవని.. రాజ్యాంగపరమైన రక్షణ ఏదీ లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.