2th ఫెయిల్ సినిమా స్టోరీకి కారణమైన రియల్ లైఫ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ ప్రమోషన్ పొందారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయనకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నుంచి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.
2003,2004,2005 బ్యాచ్‌ల ఐపీఎస్ అధికారులకు క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) పదోన్నతులకు ఆమోదం తెలిపింది. ‘ASP నుండి ప్రారంభమైన ప్రయాణం భారత ప్రభుత్వ ఆదేశంతో IG అయ్యేందుకు ఈరోజుకి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు.
విధువినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన12th ఫెయిల్ సినిమా గతేడాది అక్టోబర్ 27న రిలీజై భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. రియల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
పేద కుటుంబం నుంచి వచ్చి, 12వ తరగతి ఫెయిలైన ఓ వ్యక్తి సివిల్స్ క్రాక్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మనోజ్ కుమార్ శర్మ పాత్రను విక్రమ్ మాస్సే అద్భుతంగా పోషించారు.