Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బోయినపల్లి అభిషేక్‌కు బెయిల్

0
27

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌కు బెయిల్ మంజూరైంది. అతనికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన 5 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ట్రయిల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ వెళ్లాలని, పాస్‌ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అలాగే ఆయన భార్యకు హైదరాబాద్‌లోనే చికిత్స అందించాలని షరతులు విధించింది.

అలాగే మిగిలిన బెయిల్‌ నిబంధనలను ట్రయల్‌ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంటుందని తెలిపింది. ఈడీ అధికారులకు ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలని, సంబంధిత అధికారులకు తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా.. ట్రయల్‌ కోర్టు విచారణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈడీ కేసుల్లో ట్రయల్స్‌ జాప్యంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో 2022 అక్టోబర్‌లో అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీకి చెందిన మంత్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో ఈడీ అధికారులో కస్టడిలో విచారణను ఎదుర్కోంటున్నారు.